నిశ్శబ్దాన్ని తోడు గొని, మత్తుగొలిపే చీకటి ముసుగు
ప్రకృతి యెల్లెడలా అంచెలంచెలుగా పరచుకుంటూ
ప్రశాంతంగా అడుగు మోపింది సాయంసంధ్య; పశుపక్ష్యాదులు
తమ తమ పసరిక నెలవులకూ, గూళ్ళకూ చేరుకున్నాయి;
ఎటుజూసినా నిశ్శబ్దమే, వనప్రియ కోకిలారవం మినహా;
తను రాత్రంతా శృంగారగీతికల నాలపిస్తూనే ఉంది;
నిశ్శబ్దపు గుండె పరవశించింది. ఇపు డాకసమునిండా
ఇంద్రనీలమణులప్రభలే; ఆ నక్షత్రాతిథులమధ్య
రేచుక్క అరుణిమతో జేగీయమానంగా వెలుగులీనుతోంది;
ఇంతలో మొయిలుదొంతరల తెరలుమాటుచేసి రాజోచిత దర్పంతో
అసమాన తేజస్వియైన రేరాజు తొంగిచూసాడు. అంతే!
అంతటి రజనీ నీలాంబరమూ ... వెండివలిపమై భాసించింది.
.
జాన్ మిల్టన్
(9 December 1608 – 8 November 1674)
ఇంగ్లీషు కవి
John Milton
No comments:
Post a Comment